: అది యుద్ధ చర్యే... భారత్ తో వార్ మొదలైనట్టే!: సత్రాజ్ అజీజ్

ఎన్నో దశాబ్దాల నాటి సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు దిశగా భారత్ ఒక్కడుగు వేసినా దాన్ని యుద్ధ చర్యగానే తీసుకుంటామని, ఇరు దేశాల మధ్యా వార్ ప్రారంభమైందని భావించాల్సి వుంటుందని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సత్రాజ్ అజీజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం రద్దయినా, పాటించబోమని ఇండియా తేల్చి చెప్పినా, తీవ్ర ఇబ్బందులు తప్పవన్న భయాందోళనలో ఉన్న పాకిస్థాన్, ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని డాంబికాలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఒప్పందం నియమ నిబంధనల్లో భాగంగా, ఒక దేశం నదుల నిర్వహణ సమావేశాలకు రెండు సంవత్సరాల పాటు హాజరు కాకుంటే, రెండో దేశానికి కోర్టును ఆశ్రయించే హక్కుండదు. ఈ పరిస్థితుల్లో సింధు ఒప్పందం గురించి భారత్ ఆలోచించకుండా ఉండేలా చూసేందుకు పాక్ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఏకపక్షంగా ఒప్పందం నుంచి తప్పుకునే అవకాశం లేదన్న సత్రాజ్, ఇండియా వాటర్ వార్ కు సిద్ధమైందని, కాశ్మీర్ లో అణచివేతలను ప్రశ్నించినందుకు ఇలా ఇబ్బందులు పెట్టాలని భావిస్తోందని అన్నారు. న్యూయార్క్ లోని ఐరాస సాధారణ సమావేశంలో మాట్లాడుతూ, ఇండియా తీసుకోవాలని చూస్తున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. శాంతికి విఘాతం కలిగించేలా ఇండియా వేస్తున్న అడుగులను ఆదిలోనే అడ్డుకోవాలని కోరారు. నీటిని ఆపాలని చూడటం, యుద్ధంకన్నా ప్రమాదకరమైన నిర్ణయమని అన్నారు.

More Telugu News