: ఫోర్స్‌-2 చిత్రం కోసం జాన్‌ అబ్రహం పెద్ద సాహసమే చేశాడట!

బాలీవుడ్ న‌టుడు జాన్‌ అబ్రహం తాను న‌టిస్తోన్న ఫోర్స్‌-2 మూవీలో ఓ సీన్‌లో డూప్ సాయం తీసుకోకుండా మ‌రో రియల్‌ స్టంట్‌ చేశాడు. సదరు హీరో 2003లో వచ్చిన ఫోర్స్ చిత్రంలో డూప్ సాయం లేకుండా ఓ పెద్ద బైక్‌ను ఎత్తి క‌నిపించిన విషయం తెలిసిందే. అప్ప‌ట్లో అదే సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయింది. అయితే, ఆయ‌న బైకుని నిజంగా ఎత్తలేదని, ఆ సీన్‌ను ఫొటోగ్రఫీతో మేనేజ్‌ చేశారని ఆయ‌నపై ప‌లువురు ఆరోప‌ణ‌లు గుప్పించారు. దాంతో ప్రేక్ష‌కుల‌ను న‌మ్మించ‌డానికి జాన్ ఆ చిత్ర ప్రచారంలో పాల్గొంటూ అంద‌రి ముందు బైక్‌ని లేపి చూపించాడు. తాజాగా ఫోర్స్‌-2 చిత్రంలో స‌ద‌రు హీరోతో కారును ఎత్తే స్టంట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు భావించాడు. అందుకోసం 1580 కిలోలు బరువున్న బెంజ్‌ కారును డూప్ సాయం లేకుండా ఆయ‌న ఎత్తాల్సి ఉండ‌గా ఆయన ఒక్కడే దాన్ని మోయడం సాధ్యం కాద‌ని, మ‌రో ఇద్ద‌రి సాయంతో జాన్‌ కారు ఎత్తగలిగాడ‌ని దర్శకుడు విపుల్‌ అమృత్‌లాల్‌ షా పేర్కొన్నాడు. చిత్రంలో కారు ఎత్తే సీనుకు అంత‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా సన్నివేశం రియలిస్టిక్‌గా అనిపించడానికి ఈ ప‌నిచేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నాడు. జాన్ కారును ఎత్తాలనుకోవడం అభినందించ‌ద‌గిన విష‌య‌మ‌ని పేర్కొన్నాడు. సినిమా కోసం ఆయ‌న కష్టపడిన దానిలో వేరే న‌టులు ఉంటే పదో వంతు కూడా చేయలేరని ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. ఫోర్స్‌-2 ట్రైలర్ వ‌చ్చే శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చెప్పారు.

More Telugu News