: కరాచీ గగనతలంపై విమానాల రాకపోకలపై నిషేధాజ్ఞలు... పాక్ కీలక నిర్ణయం

కరాచీ గగనతలంపై తక్కువ ఎత్తులో ఏ విధమైన విమానాలు తిరగకుండా పాక్ నిషేధాన్ని విధించింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య మాటలయుద్ధం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సోమవారం రాత్రి పాక్ సర్కారు నోటామ్ (నోటీస్ టు ఎయిర్ మెన్) విడుదల చేస్తూ, కరాచీ గగనతలంపై 33 వేల అడుగులకన్నా తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలు నిషేధమని, కరాచీ ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (ఎఫ్ఐఆర్) సేవలు అందవని తెలిపింది. కాగా, గుజరాత్, రాజస్థాన్ సరిహద్దులకు కూతవేటు దూరంలోనే ఉండే కరాచీ నగరంపై నుంచి ఎన్నో విమానాలు వెళుతుంటాయి. నాగపూర్, భువనేశ్వర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి వచ్చే సర్వీసులన్నీ ఇదే మార్గంలో ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇవన్నీ ఏదో ఒకదశలో కరాచీ ఎఫ్ఐఆర్ తో సంబంధాన్ని కొనసాగిస్తాయి. ఇక కరాచీ అందుబాటులో లేని వేళ, ఢిల్లీ ఎఫ్ఐఆర్ పరిధిలోకి వచ్చే ముందు ఇరాన్, ఆఫ్గనిస్థాన్ లోని ఎయిర్ పోర్టుల్లోని ఎఫ్ఐఆర్ లతో సంబంధం పెట్టుకోవాల్సి వుంటుంది. ఇదిలావుండగా పాకిస్థాన్ నిర్ణయం భారత విమానయాన సంస్థలకు లాభాలను పెంచేదేనని నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు ప్రయాణించే మన విమానాలు అరేబియా సముద్రంపై నుంచి కాకుండా, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నాయి. ఇక పాక్ ఎఫ్ఐఆర్ తో బంధం లేని వేళ, ఈ విమానాలు అరేబియా మీదుగా ప్రయాణించేందుకు అనుమతిస్తే, సమయం, ఇంధనం ఆదా అవుతాయని అంటున్నారు. యూరీ దాడికి ముందే స్పైస్ జెట్ తమ విమాన సర్వీసులను అరేబియా మీదుగా నడపడానికి అనుమతించాలని డీజీసీఏను కోరింది కూడా. ఇప్పుడు ఆ దిశగా మరిన్ని సంస్థలు రిక్వెస్ట్ చేస్తే నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.

More Telugu News