: 'యుద్ధం వస్తే పాక్ కు సాయం' మాటలపై చైనా తూచ్!

ఇండియా, పాకిస్థాన్ ల మధ్య యుద్ధం వస్తే, తాము పాకిస్థాన్ కు సాయం చేస్తామని చెప్పిన చైనా, రెండు రోజుల్లో మాట మార్చింది. మరో దేశంతో యుద్ధం వస్తే పాక్ కు చైనా అండగా వుంటుందని పాక్ లో చైనా రాయబారి యు బోరెన్ చెప్పినట్టు వచ్చిన వార్తలను చైనా విదేశాంగ శాఖ కొట్టి పారేసింది. యు బోరెన్ వ్యాఖ్యలపై తమకు సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ రెండూ తమకు పొరుగున ఉన్న మిత్రదేశాలని, ఈ దేశాల విషయంలో తమ విధానం అత్యంత స్పష్టమని, విభేదాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని గత నాలుగు దశాబ్దాలుగా చెబుతున్న మాటనే చెప్పారు. కశ్మీర్ సమస్య నేటిది కాదని గుర్తు చేసిన ఆయన, ఇరు దేశాలూ చర్చల ద్వారా, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చైనా, భారత దేశాల మధ్య కూడా సరిహద్దుల సమస్య ఉందని, ఈ విషయంలో తాము చర్చలకే ప్రాధాన్యతను ఇస్తున్నామని షువాంగ్ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి వుండాలని సలహా ఇచ్చారు.

More Telugu News