: ‘బతుకు జట్కా బండి’కి రావాలంటూ బెదిరింపులు.. జీవిత వ్యక్తిగత కార్యదర్శులపై కేసు

‘బతుకు జట్కా బండి’ కార్యక్రమ నిర్వాహకురాలు జీవితా రాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శులపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమను ‘బతుకు జట్కా బండి’ టీవీ కార్యక్రమానికి రావాలంటూ జీవిత వ్యక్తిగత కార్యదర్శులు తరచూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. పార్శిగుట్ట సవరాల బస్తీకి చెందిన పి.కొండ(29) ఆటోడ్రైవర్. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోతిని 2005లో వివాహం చేసుకున్నాడు. వీరికి సంపూర్ణ(9) అనే కుమార్తె ఉంది. రెండో కాన్పు సమయంలో జ్యోతి అనారోగ్యం పాలవడంతో బాబు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరూ విడిపోయారు. ఈ సమయంలో భార్య జ్యోతికి కొండ రూ.లక్ష ఇచ్చాడు. ఇటీవల ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమాన్ని చూసిన జ్యోతి తన సమస్య పరిష్కారం కోసం జీవిత రాజశేఖర్‌ను ఆశ్రయించింది. దీంతో జీవిత వ్యక్తిగత కార్యదర్శులు అయిన కిరణ్, మరో మహిళ కలిసి కొండ, అతడి తమ్ముడికి ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా తరచూ ఫోన్లు చేసి బెదిరించడం ప్రారంభించారు. వారి బెదిరింపులను రికార్డు చేసిన కొండ చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి జీవిత వ్యక్తిగత కార్యదర్శులపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News