: టెస్టుల్లో బీసీసీఐ డ్రీమ్ టీమ్ ఇదే!

భారత టెస్ట్ క్రికెట్ కలల జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాన్పూర్ లో చారిత్రక 500వ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఫేస్ బుక్ లో ఓ పేజ్ ను ఏర్పాటు చేసిన బీసీసీఐ... టీమిండియా డ్రీమ్ టీం పేరిట టెస్టును ఎంచుకోవాలని పిలుపునిస్తూ, అభిమానుల ఓటింగ్ కోరిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక 500వ మ్యాచ్‌ లో టీమిండియా 197 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో బీసీసీఐ ‘డ్రీం టీం’ ఓటింగ్ ఫలితాలను బయటపెట్టింది. అభిమానులు కోరుకున్న డ్రీం టీం ఇదే... టీమిండియా టెస్టు ఓపెనింగ్ జోడీ...గా 86% ఓట్లతో స్ట్రైకర్ గా వీరేంద్ర సెహ్వాగ్, 68% ఓట్లతో నాన్ స్ట్రైకర్ గా సునీల్ గవాస్కర్, ఫస్ట్ డౌన్ లో అత్యధిక శాతం 96% ఓట్లతో మిస్టర్ డిపెండబుల్ దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్, సెకెండ్ డౌన్ లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ 73% ఓట్లతో ఎన్నుకున్నారు. ఆ తరువాత కీలకమైన మూడో నెంబర్ బ్యాట్స్ మన్ మణికట్టు మాంత్రికుడు వివిఎస్ లక్ష్మణ్ ను 58% ఓట్లతో ఎన్నుకున్నారు. 62% ఓట్లతో యువరాజ్ సింగ్ ను అదనపు బ్యాట్స్ మన్ గా పేర్కొంది. పేస్ బౌలింగ్ విభాగానికి 91% ఓట్లతో కపిల్ దేవ్ నాయకత్వం వహించనుండగా, అతనికి 78% ఓట్లతో జవగళ్ శ్రీనాథ్, 83% ఓట్లతో జహీర్ ఖాన్ సహకరించనున్నారు. జట్టును విజయపథంలో నడిపించే స్పిన్ విభాగం బాధ్యతను మాత్రం దిగ్గజ ఆటగాడు, ప్రస్తుత టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే 92% ఓట్లతో మోయనుండగా, అతనికి 53% ఓట్లతో రవిచంద్రన్ అశ్విన్ సహకరించనున్నాడు. కెప్టెన్ గా 90% ఓట్లతో ఎమ్మెస్ ధోనీ నిలిచాడు. ఆశ్చర్యకరంగా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన, భారత జట్టును విజయాలవైపు మళ్లించిన కెప్టెన్ గా నిలిచిన గంగూలీకి స్థానం కల్పించకపోవడం విశేషం. కోహ్లీని కూడా అభిమానులు పట్టించుకోలేదు. ఇకపోతే జట్టును మాత్రం దుర్భేధ్యంగా ఎన్నుకోవడం విశేషం.

More Telugu News