: ఓవైపు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతే.. మ‌రోవైపు చంద్ర‌బాబు విమానాల్లో తిరుగుతున్నారు: జ‌గ‌న్

భారీ వ‌ర్షాల‌కు ప‌త్తి, మిర‌ప పంటల‌కు తీవ్ర‌న‌ష్టం వాటిల్లిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని దాచేప‌ల్లిలో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆయ‌న ఈరోజు పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 2 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంటలు దెబ్బ‌తిన్నాయని పేర్కొన్నారు. పంట‌లు న‌ష్టపోయి ఓవైపు రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతే.. మ‌రోవైపు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విమానాల్లో తిరుగుతున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌తేడాది ఇవ్వాల్సిన‌ ఇన్‌పుట్ స‌బ్సిడీ కూడా ప్ర‌భుత్వం ఇప్ప‌టికీ ఇవ్వ‌లేదని ఆయ‌న అన్నారు. పంటన‌ష్టానికి రైతుల‌కు మొత్తం వెయ్యి కోట్ల రూపాయ‌లు ఇవ్వాల్సి ఉంద‌ని, అందులో రూ.120 కోట్లు గుంటూరు జిల్లాకే రావాలని జ‌గ‌న్ పేర్కొన్నారు. రుణాలు మాఫీ కాకుండా, కొత్త‌రుణాలు కూడా పొందలేక రైతులు అనేక‌ ఇబ్బందులు ప‌డుతున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. రైతులు ఇంత‌గా క‌ష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిందిపోయి బంగారంపై కూడా రుణాలు ఇవ్వ‌కూడ‌ద‌ని చంద్ర‌బాబే చెబుతున్నారని ఆయ‌న అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో రెండు, మూడు రూపాయ‌ల వ‌డ్డీకి అప్పులు తెచ్చుకొని రైతులు వ్య‌వ‌సాయం కొన‌సాగిస్తున్నార‌ని, అయిన‌ప్ప‌టికీ భారీ వ‌ర్షాల కార‌ణంగా వారికి పంట చేతికంద‌లేదని ఆయ‌న అన్నారు. న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను చంద్ర‌బాబు నేరుగా వ‌చ్చి ప‌రిశీలించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించాల‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News