: యుద్ధానికి దిగేంత రిస్క్ ఇండియా తీసుకోదు... దిగితే పెను నష్టం వాళ్లకే: పాక్ దౌత్యవేత్తలు

పాకిస్థాన్ తో ఇండియా యుద్ధానికి దిగేంత రిస్క్ చేయదని అత్యధిక మంది పాక్ దౌత్య వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్యా యుద్ధం వస్తే, పాకిస్థాన్ కన్నా ఇండియాకే అధిక నష్టమని చెబుతున్నారు. ఇండియా ఆర్థికంగా ఎంతో నష్టపోతుందని, ఆ నష్టం దశాబ్దాల పాటు పీడిస్తుందన్న సంగతి పాలకులకు తెలుసునని, కాబట్టి ఇండియా యుద్ధానికి దిగబోదని అంచనా వేస్తున్నారు. ఇక పాకిస్థాన్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న భారత్ ఆలోచన తాత్కాలికంగా ఫలించినట్టు కనిపించినా, పాక్ ఏకాకి కాదని, తమకు ఎన్నో దేశాల మద్దతు ఉందని చెబుతూ వారు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేసిన వేళ, పాక్ దౌత్యాధికారులు పత్రికలే వేదికగా మాట్లాడారు. "యుద్ధం అనేది రాదు. మేమైతే ప్రారంభించం. యుద్ధం వస్తే తమ దేశపు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్న సంగతి ఇండియాకు తెలుసు" అని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ దౌత్యాధికారి వెల్లడించినట్టు 'డాన్' పత్రిక పేర్కొంది. కాగా, పాక్ ప్రభుత్వం మిలటరీని యుద్ధానికి సన్నద్ధం చేస్తోందన్న వార్తలతో గతవారంలో చిన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించడంతో కరాచీ మార్కెట్ పాతాళానికి పడిపోయిన సంగతి తెలిసిందే. గత నెల 18న యూరీపై ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్యా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఉగ్రవాద శిబిరాలను తమ దేశం నుంచి నిర్మూలించే పరిస్థితి లేదని మరో పాక్ విద్యావేత్త వ్యాఖ్యానించారు. పాక్ మనుగడకు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను ఇప్పుడు వెనక్కు తీసుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పాక్ పై ఒత్తిడిని పెంచుతున్న కొద్దీ ఇండియానే ఒత్తిడిలో పడుతుందని పాక్ సీనియర్ జర్నలిస్ట్ జాహిద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు.

More Telugu News