: ఉగ్రవాద శిబిరాల కోసం పీఓకేలో ఎంత వెతికినా వేస్టే... ఒక్కటి కూడా లేదు: మాజీ ఉగ్రవాదుల ఇంటర్వ్యూ

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలు లేనే లేవని, వాటి కోసం ఆ ప్రాంతంలో ఎంత వెతికినా వృథాయేనని మాజీ ఉగ్రవాదులు ఓ జాతీయ వార్తా సంస్థకు కీలకమైన విషయాలను వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ ఆపరేషన్స్ చేయాలన్న వాదన పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. శిక్షణ యావత్తూ ఆఫ్గనిస్థాన్ సరిహద్దుకు దగ్గర్లో ఉంటుందని, శిక్షణ పూర్తి చేసుకుని ఇండియాలోకి వెళ్లేందుకు సిద్ధమైన వారికి ముజఫరాబాద్ లో తాత్కాలిక షెల్టర్ మాత్రమే ఏర్పాటు చేస్తారని హిజ్బుల్ ముజాహిద్దీన్, అల్ ఉమర్ ముజాహిద్దీన్ సంస్థల్లో పనిచేసి 15 ఏళ్ల జైలు జీవితం అనంతరం బెయిల్ పై విడుదలైన మాజీ ఉగ్రవాది షఫీక్ తెలిపారు. 1993లో తాను కాశ్మీర్ కు చెందిన 8 మందితో కలసి పాక్ కు వెళ్లిన విషయాన్ని తను గుర్తు చేసుకున్నాడు. పీఓకేలో తమను అద్దె ఇంట్లో ఉంచి జీహాద్ పై నూరిపోసి, పాక్, ఆఫ్గన్ సరిహద్దులో నెల రోజుల పాటు ఏకే-47, షోల్డర్ రాకెట్ లాంచర్, గ్రనేడ్స్ వాడకంపై శిక్షణ ఇచ్చారని చెప్పాడు. ఆపై తిరిగి పీఓకేకు తెచ్చి ఆయుధాలు, మందుగుండు ఇచ్చి ఎల్ఓసీ వద్ద దింపారని తెలిపాడు. సైన్యంతో పోరాటంలో ఇతని చెవికి తీవ్ర గాయం కాగా, ఆపై ఐదేళ్ల తరువాత పోలీసులకు చిక్కాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. కాగా, వీరు చెప్పిన అంశాలు వాస్తవమేనని జమ్మూ కాశ్మీర్ నిఘా విభాగం సీనియర్ ఆఫీసర్ ఒకరు సమర్థించారు. పీఓకేలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలు లేవని ఆయన అన్నారు. అవి కేవలం బేస్ క్యాంప్ లు మాత్రమేనని తెలిపారు.

More Telugu News