: తెలంగాణలో ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 1.20 లక్షలు, ఔట్ ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. తొమ్మిది గేట్లు ఎత్తివేశారు. కాగా, నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుత నీటి మట్టం 1090 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ ప్రాజెక్టును సందర్శించారు. వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో లక్షా 25 వేల క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1399 అడుగులుగా ఉంది. వరద ప్రవాహం బాగా ఉండటంతో 3 గేట్లు ఎత్తి వేసి దిగువ ప్రాంతాలకు నీటిని మంత్రి పోచారం విడుదల చేశారు. అదేవిధంగా, మహబూబ్ నగర్ లోని జూరాల ప్రాజెక్ట్ కు వరద కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నీటిమట్టం 512.2 అడుగులకు చేరింది. ‘సాగర్’ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు.

More Telugu News