: ఐటీ కంపెనీలను కంగారు పెట్టిస్తున్న వాన.. ఇంటి నుంచైనా పనిచేయాలని ఉద్యోగులకు వేడుకోలు

వారం రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు భాగ్యనగరంలోని ఐటీ కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తుండడం, ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ తెరిచి ఉందో తెలియకపోవడంతో రోడ్లపైకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. దీనికి తోడు అడుగుకో గుంతతో ప్రయాణం నరకం చూపిస్తోంది. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్‌లతో జనాలు బెంబేలెత్తుతున్నారు. దీంతో చాలామంది ఉద్యోగలు డుమ్మాలు కొడుతున్నారు. ఫలితంగా ఐటీ కంపెనీలు సంక్షోభంలో చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి తప్పించుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీల్లో కొన్ని ‘వర్క్ ఫ్రం హోం’ను ఎంచుకోగా మరికొన్ని బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్(బీసీపీ)ని ఎంచుకున్నాయి. విశాఖపట్నం, బెంగళూరులోని కేంద్రాల సాయం తీసుకుంటూ పని బోర్లా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయినట్టు ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఐటీ సంస్థలు పనివేళలను సడలించాయి. వారికి అనువైన సమయాల్లో వచ్చి పని పూర్తిచేయాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో కార్యకలాపాలు కొంతవరకు ఎటువంటి అవాంతరాలు లేకుండానే కొనసాగుతున్నట్టు పలు కంపెనీలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు ముందుస్తు జాగ్రత్తగా నిత్యావసరాల నుంచి మందుల వరకు అన్నింటినీ సమకూర్చుకుంటున్నట్టు సమాచారం.

More Telugu News