: భారతదేశాన్ని కట్టడి చేసేందుకు చైనా 'జల'ప్రయోగం!

ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశంగా, సంస్కరణలకు తలుపులు బార్లా తెరిచి, అభివృద్ధి బాటన పయనిస్తున్న భారత్ ను కట్టడి చేసేందుకు చైనా సరికొత్త ప్రణాళిక రచించింది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తికలిగిన మూడు దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. అందులో ఒకటైన భారత్ కు మిగతా రెండూ అయిన చైనా, పాకిస్థాన్ లతో నిత్యం సవాలే. ఆ రెండు దేశాలు భారత్ ను తమకు ముప్పుగా భావిస్తాయి. దీంతో భారత్ ను కట్టడి చేసేందుకు ఆ రెండు దేశాలు ఒక్కటై నిత్యం వినూత్న ప్రణాళికలకు తెరతీస్తూనే ఉంటాయి. భారత్ ను కట్టడి చేసేందుకు పాక్ ఉగ్రదాడులకు పాల్పడుతుండగా, దానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తూ చైనా కొరకరానికొయ్యగా మారింది. ఈ నేపథ్యంలో నిత్యం రెచ్చగొట్టడం ద్వారా కాకుండా భారత్ ను అదుపు చేసేందుకు చైనా వినూత్న మార్గం ఎంచుకుందని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్లేసియాలజిస్ట్ ప్రొఫెసర్ మిలాప్ చంద్ర శర్మ తెలిపారు. భారత్ మీదుగా ప్రవహించే పెద్దనదుల జన్మస్థానం టిబెట్ అన్న సంగతి తెలిసిందే. టిబెట్ లో తిష్ఠవేసిన చైనా, ఇప్పటివరకు 87 వేలకుపైగా ఆనకట్టలు నిర్మిస్,తే వాటిలో ఎక్కువ భాగం టిబెట్ లోనే వున్నాయి. మెకాంగ్ నదిపై ఎగువ ప్రాంతంలో 7 ఆనకట్టలు, సల్వీన్ నదిపై 24, ఇండస్ నదిపై 2, బ్రహ్మపుత్ర నదిపై 11 ఆనకట్టలను నిర్మించింది. టిబెట్‌ నుంచి ప్రవహిస్తున్న 10 నదులు టిబెట్, భారత్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్ దేశాల ప్రజల నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఇక్కడ ఆనకట్టలు నిర్మించడం ద్వారా ఈ నాలుగు దేశాల్లో ఎప్పుడు వరదలు రావాలి? ఎప్పుడు కరవు సంభవించాలి? అన్నదానిని చైనా నిర్ణయించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా భూకంపాలు, విపత్తులు, యుద్ధాలు సంభవించేటప్పుడు ఈ ఆనకట్టల కారణంగా పెను ముప్పు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నదుల కారణంగా సుమారు 200 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేయవచ్చని చైనా భావిస్తోందని, పాకిస్థాన్ మీదుగా ప్రవహించే నదులపై భారత్ అనకట్టలు కట్టకున్నా, చైనా మాత్రం టిబెట్ లో ఆనకట్టలు కట్టి వాటిని నిర్వహించడం ద్వారా భారత్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. 2015 మార్చిలో ‘‘టిబెట్ నదులు, ఆసియా జీవన రేఖ’’ అనే కార్యక్రమాన్ని ‘స్టూడెంట్స్ ఫర్ ఏ ఫ్రీ టిబెట్-ఇండియా’ ప్రారంభించిందని, దీనిలో భారతదేశం, థాయ్‌ లాండ్, బంగ్లాదేశ్, టిబెట్‌ లకు చెందిన నిపుణులు ఉన్నారని, వీరంతా చైనా కట్టిన ఆనకట్టలపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారని ఆయన తెలిపారు.

More Telugu News