: మూడవ రోజు ముగిసిన ఆట... న్యూజిలాండ్ పై పట్టు బిగించిన భారత్

కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 500వ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 56 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు నిలకడగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) త్వరగానే అవుట్ అయినప్పటికీ, వన్ డౌన్ లో వచ్చిన పుజారా, మరో ఓపెనర్ మురళీ విజయ్ తో కలసి మూడవ రోజు ఆట ముగిసే వరకూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. మురళీ విజయ్ 62, పుజారా 50 పరుగుల వద్దా ఆడుతున్నారు. రాహుల్ వికెట్ సోధీకి లభించింది. ఆట ముగిసే సమయానికి భారత స్కోరు 47 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు కాగా, ఆట మరో రెండు రోజులు మిగిలివుంది. రేపటి ఆటలో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేసి, లంచ్ తరువాత, టీ విరామానికి ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి న్యూజిలాండ్ ను రెండో ఇన్నింగ్స్ బరిలోకి దించాలన్నది భారత్ వ్యూహంగా తెలుస్తోంది.

More Telugu News