: పాక్ వెన్నులో భయం పుట్టించేలా భారత్ ప్లాన్... నదులపై డ్యామ్ మీద డ్యామ్ లు!

ఒక్క తుపాకీ కూడా వాడకుండా పాక్ వెన్నులో భయం పుట్టాలంటే, మరోసారి ఉగ్రవాదులకు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకోకుండా చేయాలంటే, హిమాలయాల్లో పుట్టి రెండు దేశాల్లో ప్రవహించే నదుల నుంచి పాక్ కు నీటి ప్రవాహాన్ని నిలువరిస్తే సరిపోతుందని నిపుణులు ఇస్తున్న సలహాలపై భారత ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ దిశగా 1960లో కరాచీ వేదికగా కుదుర్చుకున్న 'ఇండస్ ఒప్పందం'ను రద్దు చేయాలని, రెండు దేశాల అధికారులూ ఉన్న ఇండస్ వాటర్ కమిషన్ ను సస్పెండ్ చేయాలని సూచిస్తున్నారు. నాడు కుదిరిన డీల్ లో భాగంగా రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్ కు, ఇండస్, జీలం, చీనాబ్ నదులు పాకిస్థాన్ కు దక్కాయి. ఇవన్నీ ఇండియా మీదుగా, పాకిస్థాన్ కు ప్రవహించేవే. ఇక ఈ నదుల ప్రవాహం, పాకిస్థాన్ లోని పలు జిల్లాలను సస్యశ్యామలం చేసి అభివృద్ధికి బాటలు వేసింది. ఈ ఒప్పందం రద్దు చేస్తున్నామన్న ఒక్క మాట భారత్ నోటి వెంట వస్తే, పాక్ పాలకులపై అమితమైన ఒత్తిడి పడుతుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనలైజెస్ ఉన్నతాధికారి ఉత్తమ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఇండస్ డీల్ ప్రకారమే, 36 లక్షల ఎకరాల్లో నీటి స్టోరేజ్ కి భారత్ డ్యాములు నిర్మించుకునే అవకాశం ఉండగా, ఇంతవరకూ ఇండియా ఎలాంటి స్టోరేజ్ పనులను మొదలు పెట్టలేదని, సౌతాసియా డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్ నెట్ వర్క్ ప్రతినిధి హిమాన్షు థాకర్ గుర్తు చేశారు. పశ్చిమ నదులపై ఇంతవరకూ మన హక్కును మనం వాడుకోలేదని, ఆ అస్త్రాన్ని బయటకు తీసినా పాక్ భయపడుతుందని అన్నారు. ఇక అఫ్గనిస్థాన్ నుంచి పాకిస్థాన్ కు ప్రవహించే కాబూల్ నదిపై డ్యామ్ లను నిర్మించేందుకు ఆఫ్గన్ కు సహకరించినా పాక్ పై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు.

More Telugu News