: భారత్ కు 'సరిహద్దు' పాఠాలు చెప్పనున్న ఇజ్రాయిల్

దేశ సరిహద్దులను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక విధానాన్ని వినియోగిస్తున్న ఇజ్రాయిల్, భారత్ కు సరిహద్దు రక్షణపై సలహా, సూచనలను, ఆధునిక పరికరాలను అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని భారత్ లో ఇజ్రాయిల్ ప్రతినిధి డేవిడ్ కార్మాన్ వెల్లడించారు. "హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇజ్రాయిల్ లో పర్యటించిన వేళ, ఆయనకు పలు రకాల సరిహద్దు రక్షణ మార్గాలు, పరికరాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి వివరించాము. మొత్తం 14 రకాల పరికరాల గురించి ఆయనకు చెప్పాము. వీటిని సాయుధులు, నిఘా వర్గాలు వాడుకోవచ్చు" అని అన్నారు. నవంబర్ లో జరిగే ఇజ్రాయిల్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అండ్ సైబర్ 2016 సదస్సు వివరాలను మీడియాతో పంచుకున్న ఆయన, ఇజ్రాయిల్, భారత్ లు రెండూ సరిహద్దుల విషయంలో ఒకే విధమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు. భారత అవసరాలను తీర్చేలా తాము సహకరిస్తామని తెలిపారు. ఇజ్రాయిల్ చుట్టూ లెబనాన్, సుమేరియా, జోర్డాన్, గాజా స్ట్రిప్ లున్నాయని గుర్తు చేసిన ఆ దేశ రక్షణ శాఖ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రామ్ డోర్, ఈ దేశాల నుంచి సాకే వలసలను, చొరబాట్లను తామిప్పుడు సమర్థవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. సిరియా నుంచి చొరబాట్లను ఆపేందుకు అత్యంత అధునాతన సాంకేతికతను వాడుతున్నామని వివరించారు. కొన్ని రకాల ప్రొడక్టులను తమ నుంచి తీసుకునేందుకు భారత్ అంగీకరించిందని అన్నారు. వీటి వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News