: స్నాప్ డీల్ ను కోర్టుకు లాగి రూ. 68కే ఐఫోన్ పట్టేసిన యువకుడు

యాపిల్ ఐఫోన్లు... ప్రపంచంలోనే హైఎండ్ ఫోన్లు. వీటి ధరలు ఎగువ మధ్య తరగతికి సైతం అందనంత ఎత్తున ఉంటాయన్న సంగతి తెలిసిందే. అటువంటి ఐఫోన్లలో ఒకదాన్ని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన నిఖిల్ బన్సాల్ కేవలం రూ. 68కి సంపాదించేశాడు. ఆన్ లైన్ విక్రయ సంస్థ స్నాప్ డీల్ ను కోర్టుకు లాగి మరీ ఐఫోన్ పట్టేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బీటెక్ చదువుతున్న నిఖిల్ ఇంటర్నెట్ చూస్తుండగా, ఐఫోన్ పై 99.7 శాతం డిస్కౌంట్ ను ప్రకటిస్తూ, స్నాప్ డీల్ సంస్థ ఉంచిన యాడ్ కనిపించింది. ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకర్షించడం కోసం ఈ తరహా యాడ్స్ ఉంచుతాయన్న సంగతి తెలిసిందే. వెంటనే దాన్ని క్లిక్ చేసిన నిఖిల్ రూ. 28,999 ధర ఉండే ఐఫోన్ 5 ఎస్ ను రూ. 68కి ఆర్డర్ చేశాడు. ఆపై ఫోన్ అందనుందన్న మెసేజ్ వచ్చింది. కానీ స్నాప్ డీల్ ఫోన్ ను మాత్రం పంపలేదు. అడిగితే, టెక్నికల్ ఫాల్ట్ అన్న సమాధానం వచ్చింది. దీంతో ఆ సంస్థ మాట తప్పిందని ఆరోపిస్తూ, నిఖిల్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా, తీర్పు అతని పక్షానే వచ్చింది. స్నాప్ డీల్ రూ. 68 తీసుకుని ఐఫోన్ ఇవ్వాలని, జరిమానాగా మరో రూ. 10 వేలు చెల్లించాలని తీర్పిచ్చింది. ఫిబ్రవరిలో కేసు కోర్టుకు వెళ్లగా, తాజాగా తీర్పు వెలువడింది.

More Telugu News