: బరితెగించిన పాక్ ప్రధాని... ఐక్యరాజ్యసమితిలో బుర్హాన్ వనీని కీర్తించిన నవాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ నోరుపారేసుకున్నారు. గతంలో తమ దేశంలో మాత్రమే భారత్ ను విమర్శించే నవాజ్ షరీఫ్ ఈసారి బరితెగించి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, కశ్మీర్ అంశాన్ని భారత్ తేల్చి ఉంటే తమ ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియ మరింత ముందుకెళ్లి ఉండేదని అన్నారు. ఎన్ కౌంటర్ లో మరణించిన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీని అమరవీరుడిగా ఆయన కీర్తించారు. కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న యువతను భారత ఆర్మీ బలిగొంటోందని, ఆర్మీ పెల్లెట్ గన్ ల ధాటికి ఎంతో మంది పిల్లలు చూపుకోల్పోయారని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ లో ప్లెబిసైట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయసేకరణ ద్వారా కశ్మీరీల మనోగతం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ ఎప్పటికప్పుడు మాటతప్పుతోందని ఆయన విమర్శించారు. కశ్మీర్ లోయలో భారత ఆర్మీ అకృత్యాలపై ఆధారాలను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ కు అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ దేశాధినేతలతో సమావేశమై కశ్మీర్ అంశంపై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.

More Telugu News