: స్పీకర్ ఛాంబర్ లో చర్చపై ఉండవల్లి కట్టుకథ రాశారు: జైపాల్ రెడ్డి

విభజనకు సంబంధించి స్పీకర్ చాంబర్ లో జరిగిన చర్చపై ఉండవల్లి అరుణ్ కుమార్ తన పుస్తకంలో కట్టుకథ రాశారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఉండవల్లి రాసిన ‘విభజన కథ- నా డైరీలో కొన్ని పేజీలు’ అనే పుస్తకంలోని కొన్ని అంశాలపై జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ పుస్తకంలో ఉండవల్లి రాసిన కొన్ని అంశాలపై క్లారిటీ ఇవ్వదలచుకున్నాను. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్ లో పొన్నం ప్రభాకర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ ను కలిసి ప్రాథేయపడ్డారు. దీంతో, సుష్మా స్వరాజ్ స్పీకర్ ఛాంబర్ కు వచ్చి నాతో చర్చించింది. స్పీకర్ ఛాంబర్ లో నాడు ఏం జరిగిందో మాకు తెలుసు. అందుకు సాక్షులం మేమే. విభజన బిల్లు పెడితే, ఫ్లోర్ లీడర్ గా తాను మద్దతు ఇస్తానని నాడు సుష్మా స్వరాజ్ చెప్పారు. స్పీకర్ ఛాంబర్ లో సుష్మా స్వరాజ్ కు, కాంగ్రెస్ నేతలకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. హౌస్ ఆర్డర్ లో లేనప్పుడు బిల్లు ఎలా పెట్టాలని స్పీకర్ ప్రశ్నిస్తే.. స్పీకర్ కు నచ్చచెప్పింది నేనే. హౌస్ లో సభ్యుల మెజారిటీ ఉన్నందున విభజన బిల్లు పెట్టమని స్పీకర్ ను కోరాం. ఓటింగ్ జరిపే పరిస్థితి లేనప్పుడు, సభ్యులు కూర్చున్న చోటు నుంచే లేచి నిలబడి తమ అభిప్రాయాలను చెప్పే నిబంధన ఉంది. విభజన బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ ఎంపీలతో పాటు సుష్మా స్వరాజ్, ఇతర బీజేపీ సభ్యులు, ఎల్కే అద్వానీ కూడా స్వయంగా లేచి నిలబడ్డారు’ అని జైపాల్ రెడ్డి నాడు జరిగిన విషయాన్ని వివరించారు. ఆ రోజు స్పీకర్ ఛాంబర్ లో ఏమి జరిగిందో ఉండవల్లికి తెలియదని, ఊహించి రాయడానికి ఆయనకేమన్నా దివ్యదృష్టి ఉందా? అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఉండవల్లికే కాదు, కేసీఆర్ కు కూడా స్పీకర్ ఛాంబర్ లో నాడు ఏమి జరిగిందో తెలియదు. విభజన బిల్లు రాజ్యాంగ సమ్మతంగా లోక్ సభలో ఆమోదం పొందిందని జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News