: నాకు కులమతాల పట్టింపు లేదు: రాహుల్ గాంధీ

తనకు కులమతాల పట్టింపు లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో కిసాన్ ర్యాలీ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన...ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బ్రాహ్మణ వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, తనకు కుల, మతాలపై పెద్దగా పట్టింపులు లేవని అన్నారు. వాటికి ప్రత్యేకంగా మద్దతు తెలపడం అన్నది లేదని ఆయన స్పష్టం చేశారు. అందరినీ సమానంగా చూస్తానని ఆయన చెప్పారు. గుడిసెలోకి, గుడిలోకి వెళ్లడంలో పెద్ద తేడా చూపించనని ఆయన చెప్పారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో కూడా టీ తాగుతానని, తనకు అంతా సమానమేనని తెలిపారు. అయితే పార్టీ సీట్ల కేటాయింపు విషయంలో తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోనని, అందులో పలువురి ప్రమేయం ఉంటుందని ఆయన చెప్పారు. ప్రధానంగా ప్రస్తుతం తాను చేస్తున్న కిసాన్ ర్యాలీ కులమతాలకు అతీతమైనదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులు సమస్యల్లో ఉండగా, కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కిసాన్ ర్యాలీ నిర్వహించడంలో ఉద్దేశ్యం త్వరలో యూపీలో ఎన్నికలు జరగనుండడమేనా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను కేవలం యూపీలోనే కిసాన్ ర్యాలీ నిర్వహించాలని భావించలేదని, దేశ వ్యాప్తంగా ర్యాలీ చేయాలా? లేక ఏదో ఒకరాష్ట్రంలో ర్యాలీ తీయాలా? అని ఆలోచించి, చివరగా తొలుత యూపీలో ర్యాలీ చేద్దామని ఇక్కడి కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిసేలా చేయడం ప్రతిపక్ష నేతగా తన విధి అని ఆయన చెప్పారు.

More Telugu News