: తునిలో రైలును దగ్ధం చేసినట్టే... వైఎస్సార్సీపీని చంద్రబాబు దగ్ధం చేయాని చూస్తున్నారు: భూమన

గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఏడు గంటల సుదీర్ఘ విచారణ పూర్తైంది. కాపు ఉద్యమం సందర్భంగా దుండగులు తుని దగ్గర రైలును దగ్ధం చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఎస్సార్సీపీని దగ్ధం చేయాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గుంటూరులో సీఐడీ విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ, తుని ఘటనలో తనను ఇరికించాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తుని ఘటన చోటుచేసుకున్న రోజే తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్పలకు నోటీసులు జారీ చేసి, వారిని విచారించి సీఐడీ అధికారులు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాపు ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందువల్లే తనను విచారణకు పిలిచారని ఆయన తెలిపారు. విచారణాధికారులు నిజాయతీగా పని చేస్తున్నట్టు భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ కేసులో వాస్తవాలు వెల్లడవ్వాలంటే కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తనను మానసికంగా హింసించడం సాధ్యం కాదని, సీఐడీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. తాను నేరం చేశానని నిరూపించేందుకు ఎలాంటి ఆధారం లభ్యం కాకపోయినా పదేపదే విచారణకు పిలవడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కావాలనే విచారణ పేరుతో పదేపదే పిలుస్తున్నారని ఆయన తెలిపారు.

More Telugu News