: నా కుమారుడి మృతిపై పగ తీర్చుకుంటా.. నన్ను పాక్ కు పంపండి: అమర సైనికుడి తండ్రి

‘నాకు ఇంకా ఓపిక ఉంది. నా కుమారుడి మృతికి పగ తీర్చుకుంటాను. భారత సైన్యం తరపున నన్ను పాకిస్థాన్ కు పంపండి’ అంటూ యూరీ ఘటనలో అసువులు బాసిన అమర సైనికుడు, హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ (44) తండ్రి జగ్ నరైన్ సింగ్ అన్నారు. తన చిన్నకొడుకు మరణ వార్త విన్న అనంతరం, తన బాధను దిగమింగుతూ గద్గద స్వరంతో డెబ్భై ఎనిమిదేళ్ల వ‌ృద్ధుడైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. జగ్ నరైన్ సింగ్ కుటుంబానికి ఇది రెండో విషాదం. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కమతా సింగ్ కూడా సైనికుడే. అయితే, 1986 లో రాజస్థాన్ లోని బికనేర్ లో జరిగిన బాంబు పేలుళ్లలో కమతా సింగ్ వీర మరణం పొందాడు. తాజాగా, రెండో కుమారుడు అశోక్ కుమార్ సింగ్ యూరీ ఘటనలో అసువులు బాశాడు. ఈ విషాదంతో జగ్ నరైన్ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ‘ఐదుగురు భారత జవాన్ల మరణానికి ప్రతిగా 10 మంది శత్రువుల తలలు తెగ నరకాలి’ అంటూ జగ్ నరైన్ సింగ్ ఆగ్రహంగా అన్నారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామానికే తిరిగి రావాలని అశోక్ కుమార్ అనుకునేవాడని, యువతను ఆర్మీలో చేర్చేందుకు ప్రోత్సహించేవాడని తన కొడుకు గురించి ఆయన చెప్పారు. 1992లో సైన్యంలో చేరిన అశోక్ కుమార్ దేశ వ్యాప్తంగా చాలా ప్రదేశాలలో పనిచేశాడని, ఇటీవలే పశ్చిమబెంగాల్ లోని భిన్నగురి నుంచి యూరీ సెక్టార్ కు వచ్చాడని తెలిపారు. సరైన వసతి దొరికిన తర్వాత తన భార్య సంగీతను కూడా తీసుకువెళ్తానని అన్నాడని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆ ముదుసలి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, జగ్ నరైన్ సింగ్ కుమారులు మాత్రమే కాదు, వారి బంధువుల్లో చాలా మంది సైన్యంలో చేరినవారే. అశోక్ కుమార్ సింగ్ పెద్ద కుమారుడు వికాస్ సింగ్ కూడా సైన్యంలో ఇటీవలే చేరాడు. ధన్ పూర్ కంటోన్మెంట్ లో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అశోక్ కుమార్ తాత రాజ్ గిరీ సింగ్, బాబాయిలు, ఇద్దరు మేనళ్లుల్లు కూడా భారత సైన్యంలో పనిచేశారు.

More Telugu News