: అమర్ సింగ్ కు ప్రమోషన్... సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం

సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్ కు ప్రమోషన్ లభించింది. సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమర్ సింగ్ ను నియమించారు. కాగా, పార్టీ వ్యవహారాల్లో బయటి వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారంటూ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సమాజ్ వాది పార్టీ అధినేత, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఈ వ్యాఖ్యలను పక్కన బెట్టి, అమర్ సింగ్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టడం గమనార్హం. కాగా, గతంలో విభేదాల కారణంగా సమాజ్ వాది పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన 2011లో సొంత పార్టీ ‘రాష్ట్రీయ లోక్ మంచ్ ’ని ప్రారంభించారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 306 స్థానాల్లో తన పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపి ఒక్క సీటు కూడా ఆయన సాధించలేకపోయారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో ఆయన చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఫతేపూర్ సిక్రీ స్థానం నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన అపజయం పాలయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ సమాజ్ వాది పార్టీలో చేరారు. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు.

More Telugu News