: కావేరి జలాల వివాదంపై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం.. కర్ణాటకలో కొనసాగుతున్న 144 సెక్ష‌న్

క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురుచూస్తోన్న కావేరి నదీ జలాల వివాదం కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. కావేరి జ‌లాల్లో త‌మిళ‌నాడుకు రేప‌టి నుంచి సెప్టెంబ‌రు 30 వ‌ర‌కు రోజుకు మూడువేల క్యూసెక్కుల కావేరి నదీ జలాలు విడుదల చేయాలని కావేరి పర్యవేక్షక సమితి ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ అంశాన్ని స‌వాలు చేస్తూ క‌ర్ణాట‌క వేసిన పిటిష‌న్‌పై వాద‌న‌లు విన్న దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం, రేప‌టి నుంచి ఈనెల 27 వ‌ర‌కు తమిళనాడుకు 6 వేల క్యూసెక్కుల నీరు విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కావేరి నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. కేసును ఈనెల 27కు వాయిదా వేసింది. సూప‌ర్ వైజ‌రీ క‌మిటీ ఇచ్చిన నిర్ణ‌యంపై త‌మిళ‌నాడు, కర్ణాట‌క ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం తెలిపాయి. త‌మ అభ్యంత‌రాల‌ను మూడు రోజుల్లోగా స‌మ‌ర్పించాల‌ని సుప్రీం సూచించింది. త‌మ రాష్ట్రం త‌మిళ‌నాడు కోసం నీటిని త్యాగం చేస్తోంద‌ని క‌ర్ణాట‌క త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. త‌మిళ‌నాడులో తీవ్ర నీటికొర‌త ఉంద‌ని త‌మిళ‌నాడు త‌ర‌ఫు న్యాయ‌వాది చెప్పారు. కావేరీ జ‌లాల‌పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోన్న క‌ర్ణాట‌క రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విడుదలకు అవకాశాన్ని కల్పించబోమని ఇప్ప‌టికే హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌కలోని ప‌లు ప్రాంతాల్లో 144 సెక్ష‌న్ కొన‌సాగుతోంది.

More Telugu News