: పెళ్లిదండలకు బదులు కొండ చిలువలను మెడలో వేసుకున్న వధూవరులు!

సాధార‌ణంగా పెళ్లి చేసుకునే స‌మ‌యంలో వ‌ధూవ‌రులు పూలదండ‌లు మార్చుకోవ‌డం చూస్తుంటాం. కొన్ని చోట్ల ఉంగ‌రాలు మార్చుకుంటారు. అయితే, వాటికి బ‌దులు రెండు పెద్ద కొండ చిలువలను తీసుకొచ్చి వాటినే దండ‌ల్లా వధూవరులిద్దరూ మార్చుకుంటే..? చైనాలోని జిలిన్ రాష్ట్రంలో అదే జ‌రిగింది. పెళ్లి చేసుకోవ‌డానికి సూటు వేసుకొని అబ్బాయి, పెళ్లి గౌను వేసుకొని అమ్మాయి వేదిక‌పైకి వచ్చారు. చ‌క్క‌గా ఉంగ‌రాలు మార్చుకొని పెళ్లి చేసుకుంటార‌నుకున్న వ‌ధూవ‌రులు రెండు కొండ చిలువలను ఒకరి మెడలో మరొకరు వేసుకుని పెళ్లి చేసుకున్నారు. వాటిల్లో ఒక కొండ‌చిలువ‌ 30 కిలోలు బ‌రువు ఉండ‌గా మరొకటి 15 కిలోల బరువు ఉన్నాయి. 30 కిలోల కొండ చిలువను పెళ్లికూతురయిన‌ జియాంగ్ స్యూ మెడ‌లో ధ‌రించగా, పెళ్లి కొడుకు వు జియాన్ ఫెంగ్ మెడ‌లో 15 కిలోల బంగారు రంగు కొండచిలువ క‌నిపిస్తోంది. వాటిని మెడ‌లో వేసుకొని వ‌ధూవ‌రులు సంతోషంతో పొంగిపోయి ఆ కొండ‌చిలువ‌లే తమ బంధానికి ప్రతీకలని అన్నారు. సదరు జంట తమ పెళ్లిలో కొండ చిలువలను మార్చుకుంటుండగా తీసిన వీడియో ఇప్పుడు ఆ దేశంలోని సామాజిక మాధ్య‌మం వైబోలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఈ వ‌ధూవ‌రులు ఎందుకిలా విభిన్నంగా పెళ్లి చేసుకున్నారంటే.. వ‌న్య‌ప్రాణి ప్రేమికుల‌యిన ఇరువురూ వాటిని కాపాడాల‌నే సందేశాన్ని ఇవ్వ‌డానికే ఈ ప‌ని చేశారు. కొండ చిలువ‌ల‌ను త‌మ మెడలో వేసుకొని వాళ్లిద్ద‌రు వేదిక‌పై కౌగలించుకున్నారు కూడా. ఈ సందర్భంగా వారి మెడ‌ల్లోని కొండ చిలువ‌ల్లో ఒక‌టి వాళ్లిద్దరి చుట్టూ అల్లుకుంది. ఈ సంద‌ర్భంగా స‌ద‌రు కొత్త పెళ్లి కొడుకు మాట్లాడుతూ.. కొండ చిలువలను ర‌క్షించాల‌ని, వాటిని కొట్టవ‌ద్దని అన్నాడు. అంతేగాక‌, కొండ‌చిలువ‌లు చాలా మంచివని పేర్కొన్నాడు. వ‌న్య‌ప్రాణి ప్రేమికుల‌యిన వ‌ధూవ‌రులు వారి ఇంట్లో పలు పాములు, బల్లులు, కొండ చిలువలు, పక్షులు, కుందేళ్లు వంటి వ‌న్య‌ప్రాణుల‌ను పెంచుకుంటున్నారు. పెళ్లి కొడుకు మెడ‌లో ఉన్న అరుదైన బంగారు రంగు కొండ‌చిలువ‌ బర్మా జాతికి చెందింది. అది ఆల్బినో కావడంతో అది మ‌రో రంగులోకి మారింది. ఇది మొత్తం 23 అడుగుల వరకు పెరుగుతుంది.

More Telugu News