: ముప్పై ఏళ్ల క్రితం పెద్ద కొడుకు, ఇప్పుడు చిన్న కొడుకు బలి... ఏ మాత్రం బాధ లేదంటున్న పేద రైతు

జయనారాయణ్ సింగ్... బీహార్ లోని భోజ్ పూర్ జిల్లా పరిధిలోని రగ్డూతోలా ప్రాంతంలో నివసించే చిన్న రైతు. అతని వయసిప్పుడు 80 సంవత్సరాలు. అతని ఇద్దరు కుమారులూ ఇప్పుడతని ముందు లేరు. వృద్ధాప్యంలో చూసుకునేవారు ఎవరూ లేరని జయనారాయణ్ ఎంతమాత్రమూ బాధపడటం లేదు. తన కుమారులను తలచుకుని ఏడవడం లేదు. భరతమాత సేవలో ప్రాణాలు కోల్పోయిన తన కొడుకుల జన్మ ధన్యమైందని అంటున్నారు. దేశభక్తి మెండుగా ఉన్న ఇద్దరు కుమారులూ, సైన్యంలో చేరి జాతికి సేవలందించాలన్న ఏకైక లక్ష్యంతో తమ జీవితాలనే అర్పించారని, కొడుకులు దూరమైనందుకు బాధపడటం లేదని చెబుతున్నారు. ముప్పై సంవత్సరాల క్రితం, 1986లో రాజస్థాన్ లో విధులు నిర్వహిస్తూ, పెద్ద కుమారుడు కమ్తా సింగ్, ఉగ్రవాదులతో పోరాడి అమర వీరుడు కాగా, మొన్నటి యూరీ ఉగ్రదాడిలో చిన్న కుమారుడు హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ మరణించాడు. ఈ కుటుంబం త్యాగాన్ని ఊరు ఊరంతా కొనియాడుతోంది. అశ్రునయనాల మధ్య అశోక్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి. తన తండ్రి, బాబాయ్ చూపిన దారిలోనే అశోక్ పెద్ద కుమారుడు విశాల్ ప్రస్తుతం సైన్యంలోనే ఉన్నాడు. తన సేవలో తరిస్తున్న జయనారాయణ్ సింగ్ కుటుంబాన్ని చూసి భరతమాత గర్వపడుతుందనడంలో సందేహం లేదు.

More Telugu News