: అమెరికాలో బాంబులు పెట్టిన వ్యక్తిని పట్టించి హీరోగా మారిన ఎన్నారై!

న్యూయార్క్, న్యూజర్సీల్లో గత వారాంతాన పేలుళ్లకు కుట్ర చేసిన 28 ఏళ్ల ఆఫ్గన్ అమెరికన్ అహ్మద్ ఖాన్ రహామీని అమెరికా పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ఓ ప్రవాస భారతీయ వ్యాపారి సహకరించి 'హీరో' అనిపించుకున్నాడు. న్యూయార్క్ లో ఓ బారును నడుపుతున్న సిక్కు వ్యాపారి హరీందర్ బెయిన్స్ ఇచ్చిన కీలక సమాచారంతోనే ఫెడరల్ వర్గాలు అహ్మద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో అతని పేరు వైరల్ కాగా, అభినందనలు వచ్చి పడుతున్నాయి. బాంబులు పెట్టిన వ్యక్తిగా అనుమానిస్తూ, రహామీ చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. అదే సమయంలో తన లాప్ ట్యాప్ లో వార్తలు చూస్తున్న హరీందర్ తన బార్ పక్కన ఓ వ్యక్తిని చూశాడు. తీరా చూస్తే పోలీసులు విడుదల చేసిన ఫోటోలలోని వ్యక్తి అతనే. దీనిపై హరీందర్ చెబుతూ, "ఎవరో ఓ వ్యక్తి బార్ బయట పడుకొని ఉన్నాడు. తొలుత మందెక్కువై అక్కడ పడ్డాడేమో అనుకున్నాను. ఆపై మరోసారి చూడగా, అతనే రహీమ్ అని తెలిసింది. ఆపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. నేను కేవలం పౌరుడిగా నా బాధ్యతను నిర్వహించాను. పోలీసులే నిజమైన హీరోలు" అని చెప్పుకొచ్చాడు హరీందర్. రహీమ్ అరెస్ట్ కూడా అంత ఈజీగానే సాగలేదు. పోలీసులను చూసిన రహీమ్, వారిపై తుపాకులతో కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు అతనిపైనా కాల్పులు జరిపి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎన్ కౌంటర్ బులెట్ గాయాలైన రహీమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

More Telugu News