: మోదీ రూ. 90 వేల కోట్లు ఇచ్చారటగా? ఏం చేశారు?: కేసీఆర్ ను ప్రశ్నించిన దిగ్విజయ్ సింగ్

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అందిన రూ. 90 వేల కోట్లను ఏం చేశారన్న విషయాన్ని బయట పెట్టాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులకు రెండు రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిన సందర్భంగా దిగ్విజయ్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన, ఈ నిధులతోనే విపక్షాలకు చెందిన ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరు చెప్పి పేదల భూములను కేసీఆర్ సర్కారు కొల్లగొడుతోందని విమర్శలు గుప్పించిన దిగ్విజయ్, తెలంగాణలో రైతు హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. 2013 నాటి భూసేకరణ చట్టాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయడం లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని వివిధ మతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

More Telugu News