: రామ్‌కుమార్ మరణంపై న్యాయవిచారణ.. పోలీసుల మెడకు చుట్టుకున్న 'స్వాతి హత్య' కేసు నిందితుడి ఆత్మహత్య

టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడి ఆత్మహత్య ఇప్పుడు పోలీసుల మెడకు ఉచ్చుగా మారింది. స్వాతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామ్‌కుమార్ జూన్ 24న నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో స్వాతిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన రామ్‌కుమార్ అసలైన నిందితుడు కాదనే వాదనలు తొలి నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. కాగా జైలులో ఉన్న నిందితుడు కరెంటు వైరును నోటితో కొరికి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. జైలులో వేలాది మంది ఖైదీలు, గస్తీ సిబ్బంది ఉండగా రామ్‌కుమార్ కరెంటు వైర్లను కొరికి ఆత్మహత్య చేసుకోవడంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, పథకం ప్రకారమే అతడిని చంపేశారని ఆరోపిస్తున్న అతడి తండ్రి పరమశివం.. రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాతే కుమారుడి మృతదేహాన్ని తీసుకుంటానని భీష్మించుకున్నారు. దీంతో ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసులు ఇరుకున పడ్డారు. ప్రభుత్వానికి వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరగాల్సిన పోస్టుమార్టం నిలిచిపోయింది. ఆస్పత్రికి రామ్‌కుమార్ బంధువులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రామ్‌కుమార్ ఆత్మహత్యపై ప్రతిపక్షాలు కూడా భగ్గుమంటున్నాయి. అతడి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. ఎండీఎంకే చీఫ్ వైగో, పీఎంకే అధ్యక్షుడు రాందాస్, వీసీకే అధ్యక్షుడు తిరుమాళవన్, డీఎండీకే మహిళా విభాగం కార్యదర్శి ప్రేమలత కూడా ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

More Telugu News