: అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం.. తొలి విడతలో రూ.3,350 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చింది. తొలి విడతలో 50 కోట్ల డాలర్లు (రూ.3,350 కోట్లు) ఇవ్వనుంది. నిజానికి వరల్డ్ బ్యాంకు నుంచి 100 కోట్ల డాలర్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను గతేడాది మార్చికి ముందే కేంద్రానికి సమర్పించింది. ఇందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం(డీఈఏ) కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే వంద కోట్ల డాలర్లను ఒకేసారి తీసుకుంటే ఇబ్బందులు ఉంటాయని, కాబట్టి రెండు విడతలుగా తీసుకోవాలని సూచించింది. ఆ ప్రకారమే తొలి దశలో 50 కోట్ల డాలర్లకే సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపింది. ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ఆమోదం తెలిపినట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. మరోవైపు అమరావతి నిర్మాణానికి వివిధ ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. హడ్కో రూ.7500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మొత్తానికి వడ్డీరేటును 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గిస్తున్నట్టు సీఆర్‌డీఏకు సమాచారం అందించింది. కాగా ప్రపంచ బ్యాంకు నుంచి ఒకేసారి 100 కోట్ల డాలర్లు తీసుకుంటే బ్యాంకు పెట్టిన గడువులోగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని, లేదంటే ‘కమిట్‌మెంట్ చార్జీ’ల పేరుతో జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందుకే రెండు విడతలుగా రుణం తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు.

More Telugu News