: యుద్ధానికి మేం కూడా సిద్ధమే.. పాకిస్థాన్‌ ఆర్మీచీఫ్‌ జనరల్‌ రహీల్‌ షరీఫ్‌ ప్రకటన

యూరీ ఉగ్రదాడి తర్వాత సన్నద్ధంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లిన నేపథ్యంలో ఉగ్రదేశం పాక్ కూడా దీటుగా అడుగులు వేస్తోంది. భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ సైన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం రావల్పిండిలో టాప్ కమాండర్లతో భేటీ అయ్యారు. యుద్ధ సన్నద్ధత, సరిహద్దుల అంతర్గత భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ నుంచి ఎదురయ్యే ఎటువంటి దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాక్ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఎదురయ్యే సవాళ్లను తిప్పికొట్టేందుకు పాక్ సాయుధ బలగాలు సిద్ధంగా ఉన్నాయని రహీల్ పేర్కొన్నారు. మరోవైపు యూరీ ఉగ్రదాడిపై ఇప్పటి వరకు నోరెత్తని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై తన విష ప్రచారాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. కశ్మీర్ అంశాన్ని తప్పుదోవ పట్టించేందుకు భారత్.. పాక్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ఉగ్రదాడిపై ఎటువంటి దర్యాప్తు లేకుండానే పాక్‌పై భారత్ నిందలేస్తోందంటూ ఆ దేశ విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆరోపించారు.

More Telugu News