: సెంటిమెంట్ మెరుగుపడ్డ వేళ, కొనసాగిన స్టాక్ మార్కెట్ లాభం

గత వారం చివర్లో నమోదైన భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఇనుమడించిన సమయంలో, ఆ స్థాయిలో కాకపోయినా, అన్ని సెక్టార్లలోను కొనుగోలు మద్దతు కనిపించడంతో భారత స్టాక్ మార్కెట్ లాభం కొనసాగింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం కూడా కలిసొచ్చిందని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, యూరప్ మార్కెట్ల అనిశ్చితి మధ్యాహ్నం తరువాత కొంత అమ్మకాలకు తెరతీసినప్పటికీ, బెంచ్ మార్క్ సూచికలు నష్టాల్లోకి మాత్రం వెళ్లలేదు. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 35.47 పాయింట్లు పెరిగి 0.12 శాతం లాభంతో 28,634.50 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 28.55 పాయింట్లు పెరిగి 0.33 శాతం లాభంతో 8,779.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.63 శాతం, స్మాల్ కాప్ 0.25 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 35 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అరవిందో ఫార్మా, టీసీఎస్, టాటా పవర్, అంబుజా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,974 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,496 కంపెనీలు లాభాలను, 1,243 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,39,747 కోట్లకు చేరింది.

More Telugu News