: గుర్తుందా?... యువరాజ్ సింగ్ దెబ్బకు స్టువర్ట్ బ్రాడ్ 'అబ్బా' అన్న రోజు ఇదే!

సెప్టెంబర్ 19, 2007... ఈ తేదీన ఏం జరిగింది? అని ప్రశ్నిస్తే, ఏమీ గుర్తుకు రాదు. అదే యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో సిక్స్ సిక్సులు కొట్టిన ఘటన అని అడిగితే, వెంటనే గుర్తొస్తుంది. ఐసీసీ వరల్డ్ టీ-20 పోటీలు సౌతాఫ్రికాలో జరుగుతున్న వేళ, డర్బన్ లోని కింగ్స్ మేడ్ మైదానం వేదికగా, యువీ సాధించిన ఈ ఫీట్ చరిత్రలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ చేస్తుండగా, ఒకదాని తరువాత మరో బాల్ ను గాల్లోంచి బౌండరీల అవతలకు మళ్లిస్తూ, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నాటి యువరాజ్ ఆటను ఎవరూ మరచిపోలేరు. బాల్ బాల్ కూ బ్రాడ్ వ్యూహం మార్చినా, యువరాజ్ ముందు ఆ పప్పులుడకలేదు. ఆ ఘటన జరిగి నేటికి సరిగ్గా 9 సంవత్సరాలు. అప్పటికి వీరేంద్ర సెహ్వాగ్ 68 పరుగులతో, గౌతమ్ గంభీర్ 58 పరుగులతో బలమైన పునాదిని వేసిన వేళ, ఒత్తిడి లేని యువరాజ్ వచ్చి బ్యాటును ఝుళిపిస్తే, మైదానంలోని ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు. కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన యువరాజ్, టీ-20ల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరో 9 సంవత్సరాలు గడిచినా యువరాజ్ చేసిన ఈ ఫీట్ ను అంత తేలికగా మరచిపోవడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు.

More Telugu News