: రక్తపు మరకలతో న్యూయార్క్ చేరుకున్న పాక్ ప్రధాని షరీఫ్.. యూఎన్‌లో కశ్మీర్ అంశం ప్రస్తావన

కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో లేవనెత్తేందుకు సిద్ధమైన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్ చేతినిండా రక్తపు మరకలతో న్యూయార్క్‌లో అడుగుపెట్టారు. ఓవైపు కశ్మీర్‌లో చిచ్చు రేపుతూనే.. మరోవైపు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావించి లబ్ధి పొందాలని పాక్ భావిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని యూరీలో సైనిక బేస్‌పై దాడిచేసిన పాక్ ఉగ్రమూకలు 17 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు భారత్‌లో రక్తపుటేరులు పారుతుండగానే అవే రక్తపు మరకలతో ఆదివారం షరీఫ్ న్యూయార్క్‌లో అడుగుపెట్టారు. యూరీ దాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో జనరల్ అసెంబ్లీలో షరీఫ్ కశ్మీర్‌పై ఎలా మాట్లాడతారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరోవైపు పలు ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్ ఐక్యరాజ్యసమితి తీర్మానాలను కూడా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. కాగా యూరీ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు తమ సహకారం ఉంటుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో యూరీ ఘటన నుంచి పాక్ ఎలా తప్పించుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు యూరీ దాడి తర్వాత పాక్ మళ్లీ ఎప్పుడూ పాడిన పాటే పాడింది. భారత్‌లో ఏం జరిగినా తమనే వేలెత్తి చూపడం భారత్ మానుకోవాలని, ఆ దాడితో తమకు సంబంధం లేదంటూ పాచిపోయిన ప్రకటన చేసింది.

More Telugu News