: ఏపీపై డ్రోన్ నిఘా.. ప్రణాళిక సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు డ్రోన్లు, నిఘా కెమెరాలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. డ్రోన్లు, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో పురపాలక మంత్రి నారాయణ, ఇతర అధికారులతో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పర్యాటక, వ్యవసాయ, అనుబంధ రంగాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, శాంతి భద్రతలు, మునిసిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖల్లో డ్రోన్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చన్నారు. తుపానులు, వరదలు, విపత్తుల సమయంలో డ్రోన్లను ఉపయోగించి మెరుగైన సేవలు అందించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు, విధివిధానాల రూపకల్పన కోసం అధికారులు, నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్లను అభివృద్ధి చేసి వినియోగిస్తున్న సంస్థలను గుర్తించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను వినియోగిస్తున్నట్టు ఏపీ ఫైబర్ గ్రిడ్ ఎండీ సాంబశివరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

More Telugu News