: 2018 నాటికి ‘పోలవరం’ పూర్తి చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తా: కేవీపీ

కాంగ్రెస్ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ కోర్టుకు ఎందుకు వెళ్లిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘పోలవరం’పై ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కోర్టుకు వెళితే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అన్నారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టుల వెనుక ప్రభుత్వ స్వార్థ ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ‘పోలవరం’ గురించి ప్రశ్నిస్తే రాక్షసులు లాగా అడ్డుపడి ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని అధికారపక్ష నాయకులు అంటున్నారని విమర్శించారు. ‘ఒక కృష్ణా జిల్లా వాసిగా, ఆరోజు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమున్న ఒక వ్యక్తిగా నేను చెబుతున్నాను.. మా జిల్లాలో రైతాంగాన్ని రెచ్చగొట్టి, టీడీపీకి సంబంధించిన రైతులతో కోర్టులో పిటిషన్లు వేయించి.. స్టేలు తీసుకువచ్చింది చంద్రబాబునాయుడుగారు కాదా? అని అడుగుతున్నాను. అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని, ఆ ప్రాజెక్టును ఒక దారిలోకి తీసుకుని వస్తే, ఈరోజు గోదావరి జలాలను కృష్ణా నదిలో కలుపుకుంటున్నామంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఒకటి ఉంది, దాని గురించి మనం మాట్లాడాలి, సాధించాలి అనే ధ్యాస, సోయ.. చంద్రబాబు నాయుడుగారికి కానీ, ఆరోజు ఉన్న ఎన్డీఏ సర్కార్ కు గానీ లేవు’ అని కేవీపీ మండిపడ్డారు.

More Telugu News