: తెలంగాణలో బీజేపీకి అంత సీను లేదు: ఎంపీ కవిత

తెలంగాణలో విస్తరించాలని చూస్తున్న బీజేపీకి అంత సీను లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఆ పార్టీ నిర్వహించడంపై స్పందించిన కవిత, "మతపరమైన విషయాలు ఎక్కడ కనిపించినా, తాము విస్తరించే అవకాశాలను వెతుక్కోవడం బీజేపీకి అలవాటే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ ఆ పార్టీ ప్రవర్తన మారలేదు. ఇది విలీన దినమే కానీ, విమోచన దినం కాదని మేము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాము" అని అన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తరువాత 1948, సెప్టెంబర్ 17న పోలీసు చర్యతో హైదరాబాద్ రాష్ట్రం భారతావనిలో విలీనమైన సంగతి తెలిసిందే. దీన్ని విమోచన దినంగా పరిగణిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవాలు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, ఇది విలీన దినమేనని టీఆర్ఎస్ చెబుతోంది. ఇండియాలో ఎన్నో సంస్థానాలు విలీనం అయ్యాయని, ఇప్పుడు వెనక్కు వెళ్లి, ఉత్సవాలు జరుపుకుని, ఏం సాధించాలని భావిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కేవలం 1948 నాటి ఘటనలను మాత్రమే బీజేపీ గుర్తు చేసుకుంటోందని, ఆపై 1952, 1969, 2001లో జరిగిన ఉద్యమాల మాటేంటని అడిగారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విమోచన దినాన్ని ఎందుకు జరపలేదని నిప్పులు చెరిగారు.

More Telugu News