: టాలీవుడ్ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ అరెస్టు

శంకరాభరణం, గీతాంజలి, అభినేత్రి సినిమాల నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను విశాఖపట్టణంలోని పోతిన మల్లయ్యపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన రాజశేఖరరెడ్డి స్టేడియంకు ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 357/1, 357/2 భూములు గతంలో మధురవాడ పంచాయతీ అనుమతి పొందిన స్థలాలు. వీటిని గతంలో కొనుగోలు చేసిన వ్యక్తులు లేఅవుట్‌ వేయగా, అందులో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 88 మంది కొనుగోలు చేశారు. వారిలో 38 మంది నుంచి భూములు కొనుగోలు చేసిన ఎంవీవీ సంస్థల అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట ఓ గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించారు. వ్యాపార విస్తరణలో భాగంగా భారీ ఎత్తున ప్రకటన బోర్డులు, హోర్డింగులతో ప్రకటనలు గుప్పించారు. దీంతో, ఈ లేఅవుట్‌ లో ఉన్న ఇతరుల భూముల్ని ఆక్రమించి ఆయన లే అవుట్ కు రోడ్డు వేసుకున్నారని వారు మండిపడుతున్నారు. అంతేకాకుండా, వారికి సంబంధించిన భూముల్లో ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారని వారు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ లక్ష్మణమూర్తి ప్రాథమికంగా ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను లాసన్స్‌ బే కాలనీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో తనకు గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు. తనపై టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కుటుంబ సభ్యులు కక్షగట్టారని, వారే తనపై లేనిపోని నిందలు మోపి, తనను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు.

More Telugu News