: తెలంగాణ ప్రాజెక్టుల‌కు అడ్డు పడవద్దని చంద్ర‌బాబుకు టీ-టీడీపీ నేతలు నచ్చచెప్పాలి: తెలంగాణ రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు

ఈ నెల 21న కేంద్రమంత్రి ఉమాభారతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డకుండా ఉండేలా టీ-టీడీపీ నేత‌లు ఆయ‌న‌ను ఒప్పించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. ఈరోజు ఆయ‌న హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. అవిభాజ్య ఏపీలో అనుమ‌తులు వ‌చ్చిన రాష్ట్ర ప్రాజెక్టుల‌పై ఢిల్లీలో చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే, తెలంగాణ హైకోర్టు ఏర్పాటు ప‌ట్ల చంద్ర‌బాబు ఢిల్లీలో సానుకూలంగా లేఖ ఇచ్చేలా ఆయ‌న‌ను ఒప్పించే బాధ్య‌త‌ను తెలంగాణ టీడీపీ నేత‌లు తీసుకోవాల‌ని నిరంజ‌న్‌రెడ్డి కోరారు. తెలంగాణ స‌ర్కారు మీద టీటీడీపీ నేత‌లు విష‌ప్ర‌చారం చేయ‌డం ఆపేయాల‌ని ఆయ‌న సూచించారు. వ‌చ్చే బుధ‌వారం జ‌రిగే అపెక్స్ స‌మావేశంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల ప‌ట్ల కేంద్ర‌మంత్రి ఉమాభార‌తితో చంద్ర‌బాబు అనుకూలంగా మాట్లాడాల‌ని చెప్పారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసి, వ‌దిలేశార‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News