: దళిత ఉద్యమ నేత, ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం కన్నుమూత

ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమనేత బొజ్జా తారకం(78) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో మృతి చెందారు. ప్రముఖ కవి బోయి భీమన్నకు బొజ్జా తారకం అల్లుడు. ఆయనకు భార్య విజయశాంతి, కుమారుడు రాహుల్ బొజ్జా, కుమార్తె మహిత ఉన్నారు. ఐఏఎస్ అధికారి అయిన తనయుడు రాహుల్ బొజ్జా ప్రస్తుతం హైదరాబాదు కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శకుల కోసం ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1939లో తూర్పుగోదావరి జిల్లా కందికుప్ప, బొజ్జవారిపేటలో జన్మించిన తారకం కాకినాడలో లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1968లో విజయభారతిని వివాహం చేసుకున్నారు. ఆమె నిజామాబాద్‌లో ఉద్యోగం చేస్తుండడంతో కాపురాన్ని అక్కడికి మార్చారు. అనంతరం నిజామాబాద్‌లో పదేళ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1978లో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శివశంకర్ వద్ద పనిచేశారు. నాలుగు దశాబ్దాలపాటు ప్రజా, న్యాయపోరాటాన్ని సాగించారు. చుండూరు, కారంచేడు, వేంపెంట, లక్ష్మీపేట బాధితులకు ఆయన ఆసరాగా నిలిచారు. మానవహక్కులు, దళిత, వామపక్ష ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణళికకు శ్రీకారం చుట్టారు. భూస్వాములపై తిరుగుబాటు, అంటరానితనం నిర్మూలనే ధ్యేయంగా పనిచేశారు. నిజామాబాద్‌లో అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించారు. అనంతరం యువజన సంఘాన్ని హైదరాబాద్‌కు విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో ఏడాదిన్నర పాటు చంచల్ గూడ జైలులో ఉన్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్లపై సుప్రీంలో వాదించిన ఘనత సొంతం చేసుకున్న బొజ్జా తారకం రచయితగానూ తానేంటో నిరూపించుకున్నారు. ఆయన రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’ అనే పుస్తకానికి మంచి గుర్తింపు వచ్చింది.

More Telugu News