: ‘సిరివెన్నెల’ కోసం నా ప్రాణమిచ్చాను!: నటుడు సర్వదమన్ బెనర్జీ

సినిమాల్లో అవకాశాల కోసం తాను ఈ రోజు వరకు ఏ నిర్మాత వద్దకు వెళ్లలేదని ప్రముఖ నటుడు సర్వదమన్ బెనర్జీ అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండో సంవత్సరం చదువుతున్న రోజులవి. ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బెంగళూరు వెళ్లాను. మిస్టర్ జీవి అయ్యర్... అప్పట్లో ఆయనెవరో నాకు తెలియదు. మాసిన తెల్లటి గడ్డం, తెల్లటి కుర్తా, ధోవతి, చెప్పులు లేకుండా నడచుకుంటూ నేరుగా నా వైపే వచ్చారు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. 'ఆదిశంకరాచార్య సినిమా తీస్తున్నాను, లీడ్ రోల్ మీరే చేయాలి' అన్నారు. చేతిలో సిగిరెట్ తో ఉన్న నేను అవాక్కయ్యాను. ఆదిశంకరుడి పాత్రలో నేనా! అని ఆశ్చర్యమేసింది. ‘నాలో ఏం చూసి, ఈ పాత్రకు సెలక్టు చేసుకున్నారు? అని అడిగాను. ‘మీ కళ్లు’ అని ఆయన సమాధానమిచ్చారు. తర్వాత నటనలో శిక్షణ పూర్తికాగానే రూం ఖాళీ చేయడానికి సిద్ధమవుతుండగా, మద్రాసు నుంచి నాకు ఒక టెలిగ్రామ్ వచ్చింది. 'ఎన్ఎఫ్డీసీ పెట్టుబడితో సినిమా మొదలవుతోంది, మద్రాసు రండి' అని ఆ టెలిగ్రామ్ లో ఉంది. నటనలో శిక్షణ పూర్తయిన వెంటనే ఆదిశంకరాచార్య చిత్రంలో నటించాను. రెండున్నర సంవత్సరాల పాటు గుండు, మేకప్ లేకుండా, ఒకే కాస్ట్యూమ్, కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్నాను. ఇక ‘సిరివెన్నెల’ సినిమా కోసం నా ప్రాణం ఇచ్చాను. సినిమా అవకాశాల కోసం అసలు కష్టపడలేదు’ అని సర్వదమన్ బెనర్జీ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

More Telugu News