: చెప్పకుండా ఫేస్ బుక్ లో తన ఫోటోలు పెట్టిన తల్లిదండ్రులపై కేసు పెట్టిన కూతురు

చిన్ననాటి ఫోటోలు ఎంతో మురిపెంగా, మరెంతో అందంగా ఉంటాయి. అవి ఫోటోలని, వాటిని తీస్తున్నారన్న విషయం అప్పట్లో మనకు తెలియకపోయినా, వాటిని ఏ సమయంలో తీశారో గుర్తుండకపోయినా, తల్లిదండ్రులు ఎంతో ముచ్చటపడి వాటిని తీయించి వుంటారని మాత్రం నమ్ముతాం. అలాంటి ఫోటోలలో తెలిసీతెలియక అప్పుడిచ్చిన ఫోజులను పెద్దయ్యాక చూసుకుని సిగ్గుపడిపోయేవారెందరో వుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఓ జంట తమ బిడ్డల ఫోటోలను ఎన్నింటినో వివిధ ఫోజుల్లో తీయించుకుంటూ వచ్చింది. వారు పెరుగుతున్న కొద్దీ వివిధ దశల్లో పోగయిన ఫోటోలను వారు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ లో పెట్టారు. ఈ ఫోటోల్లోని వారి కుమార్తె, ఫోటోలు అభ్యంతరకరంగా ఉన్నాయని, చిన్నప్పుడు నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టడమేంటని తల్లిదండ్రులను నిలదీసింది. దాదాపు 500 ఫోటోలను వారు షేర్ చేసుకోగా, 700 మంది స్నేహితులు వాటిని చూశారని, తన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆమె తల్లిదండ్రులపై కేసు పెట్టింది. ఈ ఘటన ఆస్ట్రియాలో జరుగగా, కేసు విచారణ నవంబరులో కోర్టుకు రానుంది. ఇతరుల ఫోటోలు, సమాచారం సోషల్ మీడియాలో పెడితే, కఠినమైన శిక్షలే పడతాయక్కడ. ఈ కేసులో తల్లిదండ్రులే నిందితులు కాబట్టి యువతికి జరిమానా ఇప్పించవచ్చని నిపుణులు అంటున్నారు.

More Telugu News