: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రింత ముదిరిన యాద‌వ్ కుటుంబ సంక్షోభం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికార సమాజ్ వాదీ పార్టీలో నెల‌కొన్న‌ ముసలం అధిక‌మైంది. యాద‌వ్ కుటుంబ సంక్షోభం మరింత ముదిరింది. పార్టీలో తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం ల‌భించ‌డం లేద‌ని వాపోతున్న ములాయం సింగ్ యాద‌వ్‌ సోదరుడు, యూపీ రాష్ట్ర సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్ గత కొన్ని రోజులుగా రాజీనామా చేస్తానని ప్ర‌క‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను బుజ్జగించడంలో పార్టీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. ములాయం జోక్యం కూడా ఫ‌లించ‌లేదు. వెర‌సి మంత్రి ప‌ద‌వికి, పార్టీ ప‌ద‌వుల‌కు శివ‌పాల్ యాద‌వ్ రాజీనామా చేశారు. అదే బాట‌లో ఆయ‌న భార్య‌, కుమారుడు ఉన్నారు. ములాయం, అఖిలేశ్‌తో భేటీ అనంత‌రమే శివ‌పాల్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కుటుంబ క‌ల‌హాల‌తో పార్టీ శ్రేణుల్లోనూ గంద‌ర‌గోళం నెల‌కొన్న ప‌రిస్థితి యూపీలో ఉంది. ఈ నేప‌థ్యంలో స‌మాజ్‌వాదీ పార్టీ నేత‌ రాంగోపాల్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ రూపొందించిన విధానాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. పార్టీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌ని కొంద‌రు ములాయం వ్య‌వ‌హార‌శైలిని ఆస‌రాగా చేసుకొని పార్టీకి నష్టం క‌లిగిస్తున్నార‌ని అన్నారు. ఇదే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టంగా తెలిపార‌ని, త‌మ పార్టీలో స‌మ‌స్య‌లేమీలేవ‌ని వ్యాఖ్యానించారు.

More Telugu News