: ఏడేళ్ల శిక్షగా మారిన మరణదండన.. సౌమ్య హత్య కేసులో దోషికి ఉరిశిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

కేరళ యువతి సౌమ్య హత్య కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న దోవిందచామి(23)‌కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతని మరణశిక్షను రద్దు చేసిన న్యాయస్థానం, ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ మేరకు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ పీసీ పంత్, జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుపై సౌమ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాదులు నిందితుడితో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఫిబ్రవరి 1, 2011లో ఎర్నాకుళం-షోరనూర్ పాసింజర్ రైలులోని మహిళా బోగీలోకి ప్రవేశించిన సేల్స్ రిప్రజెంటేటర్ అయిన గోవిందచామి సౌమ్యను నెమ్మదిగా వెళ్తున్న రైలు నుంచి కిందికి తోసి అనంతరం తాను కూడా దూకేశాడు. తీవ్ర గాయాల పాలైన సౌమ్యను ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ సౌమ్య అదే నెల 6వ తేదీన త్రిసూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ 2012లో ఉరిశిక్ష విధించింది. కేరళ హైకోర్టు దీనిని ధ్రువీకరించింది. దీనిపై గోవిందచామి సుప్రీంకు అప్పీలు చేసుకోవడంతో, విచారించిన న్యాయస్థానం అతనిపై నమోదైన ఐపీసీ సెక్షన్ 302(మర్డర్) ను రద్దు చేసింది. ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం నిందితుడిలో కనిపించలేదని, ఆమెను కిందికి పడదోసి లైంగికంగా మాత్రమే వేధించాలనుకున్నాడని, ఈ సంఘటన తర్వాత ఆమె కొన్ని రోజులు ప్రాణాలతో వుందని పేర్కొంటూ అత్యాచారం కేసుపై ఐపీసీ 325 సెక్షన్ ప్రకారం అతడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తన 22 పేజీల తీర్పును సుప్రీం వెల్లడించింది.

More Telugu News