: ఇకపై ప్రతి సోమవారంను ‘పోలవారం’గా పరిగణిస్తాము: సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసే క్రమంలో ఇకపై ప్రతి సోమవారాన్ని‘పోలవారం’గా పరిగణిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2019 నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళిని అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమన్నారు. గోదావరి ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలించడంపైన, ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపైన ఆయన ప్రస్తావించారు. విభజన హామీల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు కల్పించాలని, ఈ విషయమై కేంద్రం చుట్టూ పదేపదే తిరగబోమని ప్రధాని నరేంద్రమోదీకి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, విజయదశమి రోజున వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్ లోకి ప్రవేశించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. విభజన కష్టాలు ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని దేశ వ్యాప్తంగా వచ్చిన 954 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 15.8 శాతం రాష్ట్రానికి వచ్చినట్లు ఆర్ బీఐ నివేదిక చెబుతోందని అన్నారు.

More Telugu News