: విదేశాలకు వెళ్లొచ్చేసరికి స్థలం ఆక్రమించి, భవనం కట్టేశారు... లబోదిబోమంటున్న హైదరాబాదీ

ఉద్యోగం నిమిత్తం సింగపూర్ కు వెళ్లి వచ్చేలోగానే, సదరు వ్యక్తి స్థలాన్ని ఆక్రమించడంతో పాటు, ఫోర్జరీ దస్తావేజులు సృష్టించి దాన్ని విక్రయించి, అక్కడ బహుళ అంతస్తుల భవంతిని కూడా కట్టేశారు భూ బకాసురులు. బాధితుడు కృపానందం ఫిర్యాదు మేరకు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాదుకు చెందిన ఏకాంబరం 1966లో అడిక్ మెట్ లో 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆయనకు కుమారుడు కృపానందంతో పాటు, కుమార్తె కూడా ఉంది. ఇటీవల ఏకాంబరం చనిపోయారు. వాస్తవానికి ఆ తరువాత ఆస్తిపై హక్కు వీరిద్దరిదే. కానీ, సింగపూర్ లో ఉద్యోగం చేసుకుంటున్న కృపానందం, ఇటీవల హైదరాబాద్ కు వచ్చి స్థలం దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఓ పెద్ద భవంతి కనిపించింది. దీంతో చెల్లికి ఫోన్ చేస్తే, తాను ఎవరికీ అమ్మలేదని సమాధానం వచ్చింది. లబోదిబోమంటూ కృపానందం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు చూడగా, స్థలం యజమానులుగా ఎవరివో ఫోటోలు పెట్టి, నకిలీ సంతకాలు చేసి గోపాలకృష్ణా కన్ స్ట్రక్షన్స్ అనే సంస్థకు అమ్మేశారు. నేరేడ్ మెట్ కార్పొరేటర్ శ్రీదేవి భర్త హనుమంతరావు, మరో ఇద్దరు ముఠాగా ఏర్పడి ఈ రిజిస్ట్రేషన్ చేయించినట్టు తేలగా, ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News