: ఒక బాబాయితో వివాదం తెచ్చుకున్న అఖిలేష్ కు మరో బాబాయ్ మద్దతు!

ములాయం కుటుంబంలో రాజకీయ చిచ్చు రగులుతూ, రెండు వర్గాలు తయారయ్యాయంటున్న రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ, ఆయన మరో సోదరుడు అఖిలేష్ కు మద్దతు పలికారు. తన మంత్రివర్గంలో ఉన్న బాబాయ్ శివపాల్ యాదవ్ కు ఉద్వాసన పలికిన తరువాత, ఆయన్ను శాంతింపజేసేందుకు అఖిలేష్ ను పార్టీ రాష్ట్రాధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించాలని ములాయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ పదవిని శివపాల్ కు ఇచ్చిన తరువాత నిన్న, యూపీలో, ఢిల్లీలో భారీ రాజకీయమే జరుగగా, అసెంబ్లీ రద్దుకు అఖిల్ యత్నిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఓవైపు తన సోదరుడు, మరోవైపు కన్న బిడ్డల మధ్య సమన్వయం కోసం ములాయం ప్రయత్నిస్తున్న వేళ, ఆయన ఇంకో సోదరుడు రాంగోపాల్ యాదవ్, తాను అఖిలేష్ వైపున్న సంకేతాలిచ్చారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు అఖిలేష్ కు చెప్పకపోవడం భావ్యం కాదని వ్యాఖ్యానించారు. "ఓ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ, అతని అనుమతి తీసుకోకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుంది. ఎన్నికలు రానున్న వేళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపై ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటిని పంచుతానని చెప్పి గౌరవంగా అఖిలేష్ తో రాజీనామా చేయించి ఉండవచ్చు" అని ఆయన అన్నారు. జరిగిన ఘటనలన్నీ చిన్న చిన్నవేనని, సమస్యలన్నీ సర్దుకుంటాయని రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్న రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. సీఎంగా కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు అఖిలేష్ కు ఉందని, వాటిని ఎవరూ ప్రశ్నించరాదని అన్నారు.

More Telugu News