: ‘ఇరుముగన్’లో లవ్‌ పాత్రలో నటించడం నాకు ఒక సవాలుగానే అనిపించింది: సినీ హీరో విక్రం

విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఇంకొక్కడు' (ఇరుముగన్). వసూళ్లు బాగానే ఉండడంతో, ఆ చిత్రం బృందం సంబ‌రాల్లో మునిగిపోయింది. ఈ సినిమా హీరో విక్రమ్ చిత్రం కోసం చేసిన తీవ్ర కసరత్తులు మంచి ఫ‌లితాలే ఇచ్చాయి. మొద‌ట మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని భావించారు. అయిన‌ప్ప‌టికీ చిత్రం మంచి వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో చెన్నైలో చిత్రం టీమ్ మీడియా స‌మావేశం నిర్వ‌హించి సినీ యూనిట్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ సందర్భంగా ఇంకొక్క‌డు చిత్రం నిర్మాత శిబు తమీమ్ మాట్లాడుతూ... త‌మ చిత్రం ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 థియేటర్లలో ఆడుతోంద‌ని చెప్పారు. త‌మిళ‌నాడులో విజ‌యవంతంగా రెండో వారం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంద‌ని అన్నారు. చిత్రం కోసం తాము ప‌డ్డ శ్ర‌మ‌కు త‌గ్గ ఫలితాన్ని ప్రేక్షకులు త‌మకు అందిస్తున్నారని ఆయ‌న పేర్కొన్నారు. సినిమాకు మ‌రింత‌ బడ్జెట్‌ పెంచితే హాలీవుడ్ సినిమాల‌కు మించి దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించేవారని ఆయ‌న చెప్పారు. తాము సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌లోనే రెండు నెలల్లో ఈ స్థాయిలో సినిమాను తీయడం ప‌ట్ల త‌న‌కు ఎంతో ఆశ్చర్యం క‌లుగుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా హీరో విక్రం మాట్లాడుతూ.. దర్శకుడు ఆనంద్‌ శంకర్‌పై ప్ర‌శంసల జ‌ల్లు కురిపించారు. అత‌డిలో మంచి ప్రతిభ ఉందని పేర్కొన్నారు. ఆనంద్ శంక‌ర్ భ‌విష్య‌త్తులో మ‌రింత‌ ఉన్నతస్థాయికి ఎదుగుతారని ఆయ‌న అన్నారు. సినిమాకు కలెక్షన్లు బాగా వ‌స్తున్నాయ‌ని చెప్పారు. త‌న‌కు ఈ సినిమాలో నటన పరంగా మంచి పేరు వచ్చింద‌ని పేర్కొన్నారు. ఈ సినిమాలో లవ్‌ పాత్రలో నటించడం త‌న‌కు ఒక సవాలుగానే అనిపించిన‌ట్లు చెప్పారు. ఈ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించిన ఘనత ఆనంద్ శంక‌ర్‌దేన‌ని అన్నారు. ఆయ‌న‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అనంత‌రం దర్శకుడు ఆనంద్ శంక‌ర్ మాట్లాడుతూ... తాను సినీహీరో విక్రంకి వన్‌లైన్‌ కథ మాత్రమే వినిపించిన‌ట్లు చెప్పారు. దాన్ని విన‌గానే ఈ సినిమాలో నటించేందుకు విక్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. అనంత‌రం తాను ఈ కథను చాలా వరకు మార్చిన‌ట్లు పేర్కొన్నారు. లవ్‌ పాత్రను విక్ర‌మ్ కోసమే సినిమాలో ప్ర‌త్యేకంగా తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. విక్రం లేకపోతే సినిమా విజ‌యాన్ని అందుకోలేక‌పోయేవారిమ‌ని చెప్పారు.

More Telugu News