: డబ్బుల్లేక భార్య మృతదేహాన్ని మోసుకెళ్లిన దానా గుర్తున్నాడా? ఇప్పుడతని వద్ద డబ్బే డబ్బు!

ఆసుపత్రిలో వైద్యం అందక తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని తరలించేందుకు కూడా డబ్బుల్లేని స్థితిలో శవాన్ని భుజంపై వేసుకుని, కుమార్తెతో కలసి పది కిలోమీటర్లకు పైగా నడిచిన ఒడిశా, కలహండి ప్రాంతానికి చెందిన దానా మాఝి గుర్తున్నాడా? నెల రోజుల క్రితం చేతిలో రూపాయి కూడా లేని స్థితిలో ఉన్న దానా, వద్ద లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చి పడ్డాయి. దానా తన భార్య మృతదేహాన్ని తీసుకువెళుతున్న వార్తను దేశవ్యాప్తంగా మీడియా ప్రాచుర్యంలోకి తేగా, ఎంతో మంది స్పందించి ఆర్థిక సాయం చేస్తుండటంతో, ఆయన కష్టాలన్నీ కడతేరిపోయాయి. బెహరైన్ ప్రధాని నుంచి సామాన్యుల వరకు ఎంతో మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఆయనకు డబ్బు పంపగా, తన బిడ్డలను చదివించుకునేందుకు వీటిని వినియోగిస్తానని దానా చెబుతున్నాడు. ఆయన పిల్లలకు ఎంత వరకైనా ఉచితంగా విద్యను చెప్పిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించి, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణానికి రూ. 75 వేలను ఇచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ రూ. 30 వేల సాయం చేయగా, జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ రూ. 52 వేలను, బియ్యం కోటాను ఇప్పించింది. సులభ్ ఇంటర్నేషనల్ రూ. 5 లక్షల డబ్బును ఐదేళ్ల కాలపరిమితికి ఫిక్సెడ్ చేసి, పెద్ద కుమార్తె చాందికిని ఉద్యోగం ఇస్తామని, అది వద్దనుకుంటే, వివాహం జరిగేంతవరకూ నెలకు రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర స్వచ్ఛంద సంస్థ ఒకటి రూ. 80 వేలను దానాకు, ముగ్గురు కుమార్తెలకు రూ. 10 వేల చొప్పున ఇచ్చింది. గుజరాత్ కు చెందిన ఇద్దరు వ్యాపారులు చెరో లక్ష రూపాయలను, యూఎస్ లో ఉన్న ఒడిసా వాసి ఒకరు రూ. 1.05 లక్షలను పంపారు. ఇలా దానా కష్టాలన్నీ తీరిపోగా, ఆయన ఇరుగు, పొరుగు వారు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇటువంటి బీదవారు తమ ఊరిలో ఇంకా మరెందరో ఉన్నారని గుర్తు చేస్తూ, వారెవరిపై లేని ప్రేమ, దయ దానాపై మాత్రమే ఎందుకని ప్రశ్నిస్తుండటం గమనార్హం.

More Telugu News