: పాకిస్థాన్ 'కాశ్మీర్' అన్న వేళ, బెలూచిస్థాన్ సంగతేంటంటూ ఇబ్బంది పెట్టిన ఇండియా

జనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశాలు జరుగుతున్న వేళ, జమ్మూ కాశ్మీర్ లో అశాంతికి భారత్ వైఖరే కారణమని పాకిస్థాన్ ఆరోపించగా, అందుకు ఇండియా సైతం దీటుగా స్పందించి, బెలూచిస్థాన్ ను, అక్కడ జరుగుతున్న పాక్ దుర్మార్గాన్ని, దౌర్జన్యాలను మరోసారి ఎండగట్టింది. పాకిస్థాన్ ప్రభుత్వం తన అధికార దర్పంతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తోందని, బెలూచ్ ప్రాంతంలో మానవ హక్కులన్న మాటే వినపడకుండా చేస్తోందని ఐరాసలో భారత ప్రతినిధి అజిత్ కుమార్ ఆరోపించారు. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో పాకిస్థాన్ ముందు నిలిచిందని, జమ్మూ కాశ్మీర్ లో కొంత భాగాన్ని చట్టవ్యతిరేకంగా ఆక్రమించుకోవడమే కాకుండా, మిగిలిన ప్రాంతంలో అశాంతికి కారణమవుతోందని ఆయన దుయ్యబట్టారు. ఇతర దేశాలను విమర్శించే ముందు తన వైఖరిని పాక్ మార్చుకోవాలని సలహా ఇచ్చారు. కాగా, అంతకుముందు జమ్మూలో ఇటీవలి నిరసనలకు భారత్ సైన్యం దాష్టీకాలే కారణమంటూ పాక్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి తరఫున అంతర్జాతీయ కమిటీ ఒకటి కాశ్మీర్ లో పర్యటించడానికి భారత్ అనుమతించలేదని గుర్తు చేసింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన అజిత్ కుమార్, ఉగ్రవాదిగా మారిన ఓ యువకుడి మరణం తరువాత పాక్ తన దుర్మార్గపు చర్యలతో అల్లరి మూకలకు డబ్బులిచ్చి నిరసనలను పెంచిందని, పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే పర్యటించాలని ఐరాసకు తాము సలహా ఇచ్చామని చెప్పారు.

More Telugu News