: భారీ జాతీయ జెండాను ఆవిష్కరించకుండానే వెళ్లిపోయిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు!

విశాఖపట్టణం విమానాశ్రయంలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించకుండానే సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెళ్లిపోయారు. జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా సదరన్ రీజియన్ లోని అన్ని విమానాశ్రయాల్లో ఈరోజు జాతీయ జెండాలు ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే విశాఖపట్టణం విమానాశ్రయం ప్రాంగణంలోని గార్డెన్ లో 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉన్న భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. విశాఖ లో ఈరోజు జరిగిన బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఈ జెండాను ఆవిష్కరించాలని ఎయిర్ పోర్టు డైరైక్టర్ వినోద్ కుమార్ శర్మ భావించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను సంప్రదించారు. సీఎం, కేంద్ర మంత్రి షెడ్యూల్ లో ఈ కార్యక్రమాన్ని కూడా పొందుపరిచారు. అయితే, తొలుత విమానాశ్రయంలో దిగిన వెంకయ్యనాయుడు పాత టెర్మినల్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చారు. బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఊరేగింపుగా నగరంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చిన చంద్రబాబు, కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిక్స్ సదస్సుకు వెళ్లిపోయారు. దీంతో, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శర్మ ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై కలెక్టర్ కి ఫోన్ చేసి అడిగితే .. ‘వారికి తీరిక లేదు’ అనే సమాధానం వచ్చిందని సమాచారం. ఈ క్రమంలో కలెక్టర్ తో శర్మ చర్చించి .. మరోసారి జెండాను ఆవిష్కరింపజేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అప్పటివరకు భారీ జెండాను జాగ్రత్తగా దాచి ఉంచాలని సిబ్బందికి సూచించారు. అయితే, ఈలోగా వర్షం కురవడంతో జెండా తడిసిపోయింది. దాంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆవిష్కరించాల్సిన జెండాను తీసేశారు.

More Telugu News